Ambati Rambabu: నేను పవన్ కల్యాణ్ లా ఎక్కడంటే అక్కడ స్టెప్పులేస్తానా?: అంబటి రాంబాబు

  • ఓ మీడియా చానల్ జర్నలిస్టులతో అంబటి రాంబాబు క్వశ్చన్ అవర్
  • ఎమ్మెల్సీ ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు తేడా ఉంటుందన్న అంబటి
  • తాను వెరీ వెరీ సీరియస్ పొలిటీషియన్ అని స్పష్టీకరణ
Ambati Rambabu answers to journalists

ఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు ఓ మీడియా చానల్ నిర్వహించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ప్రతికూల ఫలితాలు రావడం పట్ల ఓ పాత్రికేయుడు ప్రశ్నించగా... ఎమ్మెల్సీ ఎన్నికలు పరోక్ష ఎన్నికలని, అక్కడ వ్యక్తుల ప్రభావం ఉంటుందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. కానీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు అలా కాదని, ఇవి ప్రజలతో ప్రత్యక్షంగా ముడిపడి ఉంటాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలతో పోల్చరాదని తెలిపారు. 

ఇక, తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి లాగా అంబటి రాంబాబు కూడా నాన్ సీరియస్ పొలిటీషియన్ అంటారు... దీనిపై మీరేమంటారు? అని మరో పాత్రికేయుడు అంబటి రాంబాబును అడిగారు. అందుకాయన స్పందిస్తూ... మల్లారెడ్డి గెలిచాడు కదా... అలాంటప్పుడు ఆయనను నాన్ సీరియస్ పొలిటీషియన్ అని ఎలా అంటారు? అని అంబటి రాంబాబు ఎదురు ప్రశ్నించారు. 

నేను మాత్రం వెరీ వెరీ సీరియస్ పొలిటీషియన్... ఆయన ఎలాంటి పొలిటీషియనో నాకు తెలియదని అని పేర్కొన్నారు. నా దృష్టిలో ఆయన చాలా సీరియస్ పొలిటీషియన్ కాబట్టే తెలంగాణలో వ్యతిరేక పవనాలు వీచినా గానీ గెలిచారనుకుంటున్నాను అని అంబటి రాంబాబు వెల్లడించారు. 

అయితే, ఆ పాత్రికేయుడు "స్టెప్పులు, డ్యాన్సులు" అంటూ వ్యాఖ్యానించగా.... "అది డిఫరెంట్ మ్యాటర్ అబ్బా... పవన్ కల్యాణ్ లాగా నేను రోజూ ఎక్కడ పడితే అక్కడ స్టెప్పులు వేస్తానా ఏంటి? ప్యాకేజి తీసుకుని స్టెప్పులు వేస్తానా? సంక్రాంతికి నేను చేసేది ఆనంద తాండవం... అంత హిస్టరీ ఉంటుంది దానికి... ఆ తర్వాత నేనెప్పుడూ డ్యాన్స్ చేయను..." అంటూ అంబటి రాంబాబు బదులిచ్చారు.

More Telugu News